Mana Enadu : 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన వేళ భారతీయులంతా జరుపుకుంటున్న తొలి దీపావళి (Diwali Festival) ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది అని అన్నారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ దీపావళి చాలా స్పెషల్
ధన త్రయోదశి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. మరో రెండ్రోజుల్లో ప్రత్యేకమైన దీపావళి జరుపుకోబోతున్నామన్న ఆయన దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు (Ayodhya Ram) కొలువైనవేళ వచ్చిన తొలి దీపావళి ఇది అని వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక వేళకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నామని.. నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
40 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా
దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్ మేళాల(Rozgar Mela)ను నిర్వహించి వివిధ మంత్రిత్వ శాఖల్లో నియామకాలు చేపట్టారు. ‘కర్మయోగి ప్రారంభ్’ విధానం కింద ఈ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారికి ట్రైనింగ్ అందిస్తున్నారు. ఐజీవోటీ కర్మయోగి పోర్టల్‌లో దాదాపు 1,400 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. వారికి వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్పుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో రోజ్ గార్ మేళా
ఇక తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ (Hyderabad) నగరాల్లో రోజ్ గార్ మేళాలను నిర్వహించారు. వైజాగ్‌లో వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొనగా.. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణలో 155 మందికి నియామక పత్రాలు
ఈ సందర్భంగా ఆయన 155 మందికి ఆయన నియామక పత్రాలు అందించారు. కేంద్ర విభాగాల్లో ఖాళీలు ఉండకూడదనే ప్రతి నెలా రోజ్‌గార్ మేళా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఇప్పటికే 9 లక్షల మందికి నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా 51 వేల మందికి నియామక పత్రాలు అందిస్తున్నట్లు వివరించారు. యువశక్తి సాయంతో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చని పేర్కొన్నారు.






