
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వచ్చే నెలలో తాను మోదీ (PM Modi)తో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ సోమవారం ఫోన్‌లో (Modi Trump Phone Call) మాట్లాడిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరిలో అమెరికాకు మోదీ
ఈ సందర్భంగా విలేకర్లు ఈ విషయంపై ట్రంప్ ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ సోమవారం ఉదయం మోదీ (PM Modi)తో సుదీర్ఘంగా మాట్లాడానని తెలిపారు. భారత్ తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. వచ్చే నెలలో మోదీ వైట్ హౌస్‌కు రావొచ్చని వెల్లడించారు. అక్రమ వలసదారుల అంశంపైనా మోదీతో తాను చర్చించానని.. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను విశ్వసిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య అనుబంధంపై చర్చ
తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్(Trump India Visit)లోనే చేపట్టిన విషయం తెలిసిందే. 2020లో అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయన మోదీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌తో మోదీ సోమవారం రోజున ఫోన్‌లో మాట్లాడి.. రెండు దేశాల సంబంధాలను పైపైకి తీసుకువెళ్లడంపై చర్చించారు.