ManaEnadu : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను సందర్శించనున్నారు. 56 ఏళ్ల తర్వాత గయానాలో భారత ప్రధాని పర్యటించబోతుండటం గమనార్హం.
17 ఏళ్లలో నైజీరియాలో భారత ప్రధాని తొలి పర్యటన
ఈనెల 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రధాని మోదీ నైజీరియా(Modi Nigeria Visit)లో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని తెలిపింది.
18న బ్రెజిల్ కు ప్రధాని మోదీ
ఇక నైజీరియా నుంచి ప్రధాని నవంబర్ 18న బ్రెజిల్ (Modi Brazil Visit) పర్యటనకు వెళ్లనున్నారు. 18, 19వ తేదీల్లో రియోడిజనీరో నగరంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే జీ-20 సదస్సులో పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపనున్నారు. బ్రెజిల్ తర్వాత మోదీ గయానాలో పర్యటిస్తారు.
56 ఏళ్ల తర్వాత గయానాకు భారత ప్రధాని
గయానీస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గయానాలో పర్యటించనున్నారు. 56 ఏళ్ల తర్వాత (1968 తర్వాత) భారత ప్రధాని గయానాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో మోదీ గయానా (Guyana) అధ్యక్షుడు మొహమ్మద్ అలీ.. ఇతర సీనియర్ నాయకులతోనూ సమావేశం కానున్నారు. గయానా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ఆయన మాట్లాడనున్నారు. ఇంకా.. ఇక్కడ జరిగే రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా మోదీ పాల్గొంటారు.






