టాలీవుడ్ సింగర్ కల్పన (Kalpana) ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. తన కుమార్తె విషయంలో ఆవేదనకు గురైన తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు కల్పన తెలిపారు.
ఆమె కోసమే చనిపోవాలనుకున్నా
“నా పెద్ద కుమార్తె కేరళలో చదువుకుంటోంది. ఆమెను హైదరాబాద్ కు రావాలని కోరాను. కానీ ఆమె నా మాట వినడం లేదు. కేరళకు వెళ్లి తనను రమ్మని కోరారు. కానీ రానంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి రమ్మని పిలిచాను. ఇక్కడే తన చదువు కొనసాగించమని అడిగాను. అయినా రానని తెగేసి చెప్పింది. ఈ విషయంలోనే నేను ఆవేదనకు గురయ్యాను. ఈ క్రమంలోనే చనిపోవాలని నిర్ణయించుకున్నాను.” అని కల్పన పోలీసు వాంగ్మూలం (Singer Kalpana Statement)లో పేర్కొన్నారు.
ఆత్మహత్యాయత్నం చేసిన కల్పన
హైదరాబాద్ నిజాంపేటలో నివాసముంటున్న సింగర్ కల్పన మంగళవారం రోజున ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తన భర్త ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన కల్పన నివాసముంటున్న అపార్టమెంట్ సెక్రటరీకి కాల్ చేసి కల్పన గురించి వాకబు చేయాలని కోరారు. అయితే సెక్రటరీ అపార్ట్మెంట్ వాసులతో ఆమె ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ కొట్టగా ఆమె తలుపులు తీయలేదు. ఎంత సేపు డోర్లు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
కల్పన వాంగ్మూలం రికార్డు
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా.. ఆమె బెడ్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఇవాళ స్పృహలోకి వచ్చిన కల్పన వాంగ్మూలాన్ని కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేశారు.






