
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ (Delhi Assembly Polls 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,766 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
9 గంటల వరకు 8.10 శాతం ఓటింగ్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ (BJP) 68 స్థానాల్లో బరిలోకి దిగింది. కమలం పార్టీ మిత్రపక్షాలు జేడీయూ (JDU), లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీలో నిలిచాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఈనెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.
ఓటేసిన రాష్ట్రపతి
మరోవైపు దిల్లీ అసెంబ్లీ పోలింగ్ లో ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దిల్లీ నిర్మాణ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Murmu Voting) ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌నివాస్ మార్గ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కాల్‌కాజీ పోలింగ్ కేంద్రంలో సీఎం అతిశీ (Delhi CM Vote) ఓటేశారు. సతీమణితో కలిసి ఆప్ నేత మనీశ్ సిసోదియా ఓటు వేశారు.
ప్రముఖుల ఓటింగ్
నిర్మాణ్‌భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Vote) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. శాంతినికేతన్ కేంద్రంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఓటేయగా.. లేన్‌లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ కె.కమ్రాజ్ ఓటు వేశారు.