మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పలు హామీలు ఇస్తున్నాయి.
ఎవరు గెలిచినా నెలకు రూ.2100
ఇప్పటికే ఆమ్ ఆద్మీ, బీజేపీలు.. మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయాన్ని అందించే పథకాన్ని పోటాపోటీగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన (CM Mahila Samman) కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 అందిస్తామని ఆప్ ప్రకటించగా.. ప్యారీ దీదీ యోజన ద్వారా కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఇదే మొత్తం నగదును మహిళలకు ప్రతి నెల అందిస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే మహిళలు ఎవరి వైపు నిలబడతారనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
46.2 శాతం మంది ఓటర్లు మహిళలే
దిల్లీ ఓటర్లలో 46.2 శాతం మంది మహిళలు (Delhi Woman Voters) ఉన్నారు. మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉండగా.. 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు ఉన్నారు. ఇక ఈ ఆర్థిక సాయం హామీ హామీగానే మిగిలిపోతుందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కాకపోయే అవకాశం ఉందని మహిళలు సందేహం వెలిబుచ్చుతున్నారు. నిధుల కొరత సాకుతో అమలు చేయకపోవచ్చని.. ఒకవేళ మొదట్లో ఆర్థిక సాయం అందజేసినా.. కొన్నిరోజుల తర్వాత దాన్ని నిలిపివేసే అవకాశమూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






