గత నాలుగు రోజుల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖలపై దాడులు (IT Raids in Hyderabad) నిర్వహిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthuna,) సినిమాలతో ఈ సంక్రాంతికి పలకరించిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, ఈ సంస్థ అధినేత దిల్ రాజుపై ఐటీ పంజా విసిరింది. దాదాపు మూడ్రోజుల పాటు దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
నా ఒక్కడిపైనే జరగలేదు కదా
ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju IT Raids) తాజాగా స్పందించారు. ఐదేళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని ఆయన తెలిపారు. ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చామని.. సినిమాలు, పెట్టుబడుల వివరాలు అడిగితే చెప్పామని వెల్లడించారు. వాటికి సంబంధించిన పత్రాలన్నీ వాళ్లు తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగలేదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
నిబంధనల ప్రకారమే సోదాలు
నిబంధనల ప్రకారమే ఐటీ అధికారులు సోదాలు జరిపారని దిల్ రాజు తెలిపారు. 90 శాతం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారని.. ఇక బ్లాక్మనీ సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ, ఆ సినిమా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ మ్యాంగో మీడియా సంస్థ అధినేత ఇళ్లు, ఆఫీసులపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.






