IPL 18వ ఎడిషన్‌లో నేడు కీలక పోరు జరగనుంది. తొలిసారి కప్ నెగ్గేందుకు పోటీపడాలంటే పంజాబ్ కింగ్స్(PBKS) ముందుగా ఈరోజు జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్(MI)ను పడగొట్టాల్సిందే. మరోవైపు ఇప్పటికే ఐదు టైటిళ్లు ఖాతాలో ఉన్న MI ఆరో కప్ దిశగా వేట కొనసాగిస్తోంది. లీగ్ తొలి మ్యాచుల్లో విఫలమైన ముంబై.. ఆ తర్వాత భీకర జట్టుగా తయారైంది. దాదాపు ఆ జట్టులోని అందరు ప్లేయర్లు ఫుల్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు ఇవాళ కలిసొచ్చే అవకాశం ఉంది. ఇటు శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) సారథ్యంలోని పంజాబ్ తొలి మ్యాచు నుంచి పాజిటివ్ మెండ్‌సెట్‌తో విజయాలు సాధిస్తూ వస్తుంది. కానీ క్వాలిఫయర్-1లో అనూహ్యంగా RCB చేతిలో కంగుతింది. దీంతో అచ్చొచ్చిన అహ్మదాబాద్(Ahmadabad) పిచ్‌పై ముంబైని ఎలాగైనా పడగొట్టాలని పంజాబ్ భావిస్తోంది.

ఐపీఎల్ చరిత్రలో సమవుజ్జీలే.. కానీ
ఇక ఐపీఎల్ హెడ్ టు హెడ్ హిస్టరీలో ముంబై, పంజాబ్ జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో ఎదురుపడ్డాయి. అందులో ముంబై 17 విజయాలు నమోదు చేయగా.. పంజాబ్ 16 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అయితే, అహ్మదాబాద్‌లో PBKSకే మెరుగైన రికార్డు ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేసింది. ముంబై ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. అయితే IPL ప్లేఆఫ్స్ చరిత్రలో MIకి మంచి రికార్డు ఉంది. 21 మ్యాచ్‌ల్లో 14 విజయాలు సాధించింది. అందులో ఐదుసార్లు ఫైనల్‌లో నెగ్గింది. మరోవైపు, పంజాబ్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడింది తక్కువే. ఐదు మ్యాచ్‌లే ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

ముంబై-పంజాబ్ బలాబలాలు ఇలా..
ఇక జట్టు బలాబలాల విషయానికొస్తే.. ముంబై అన్ని విభాగాల్లో చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి రావడం మరింత ప్లస్. అటు జానీ బెయిర్‌స్టో, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(SKY), పాండ్యలతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. ఇక బౌలింగ్‌లో స్పీడ్ గన్స్ బుమ్రా(Bumrah), బోల్ట్ ఉండగా వీరికి తోటు స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ తోడుగా ఉన్నాడు. అటు పంజాబ్‌లో అనుభవం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రియాంశ్(Priyansh), ప్రభ్‌సిమ్రన్, శశాంక్, నేహాల్ వధేరా, అయ్యర్(Ayyar) పుంజుకుంటే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. గాయం నుంచి తేరుకున్న స్టార్ స్పిన్న ర్ చాహల్(Chahal) చేరిక పంజాబ్‌కు ప్లస్ అవ్వొచ్చు.







