
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy)తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్సంటేజీ ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనడంలో తప్పులేదన్నారు.
చర్చలకు సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేది
‘గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. అవార్డుల విజేతలకు అభినందనలు. ఏపీలో సీఎం చంద్రబాబు (Chandra babu) కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నా. పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. అయితే, తన చిత్రం హరి హర వీరమల్లు’ ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్‌పై గౌరవం మరింత పెరిగేది’ అని అన్నారు. ప్రభుత్వం తండ్రిలాంటిదని వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు
‘ఈరోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్‌లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవాలని అనడంలో తప్పులేదు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుంది. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు’ అని నారాయణమూర్తి పేర్కొన్నారు.