Mana Enadu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో హద్దు దాటే బౌన్సర్లపై తీవ్ర చర్యలు ఉంటాయని సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) తెలిపారు. భయానక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu Case) కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇది కోర్టు పరిధిలో ఉందని.. హైకోర్టు ఆయనకు ఈనెల 24 వరకు గడువు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
క్రైమ్ రేటు తగ్గించాం
హైదరాబాద్ లో కమిషనరేట్ పరిధి నేర వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Latest News) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీని ఉపయోగించి క్రైమ్ రేటు (Rachakonda Crime Rate) తగ్గించామని తెలిపారు. 2024లో మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది నమోదైన 33,084 కేసుల్లో 25,143 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక కేసులను పరిష్కరించిన కమిషనరేట్‌గా రాచకొండ నిలిచిందని వివరించారు.
4 శాతం పెరిగిన క్రైమ్ రేటు
లోక్ అదాలత్‌లో 11,440 కేసులతో పాటు 70,791 పెట్టీ కేసులు పరిష్కరించినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది డయల్ 100 ద్వారా 2,41,742 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అన్ని విభాగాల్లో కలిపితే క్రైమ్ రేటు 4% మాత్రమే పెరిగిందని.. గతేడాదితో పోలిస్తే హత్య కేసుల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. చోరీ కేసులు 6%, డొమెస్టిక్ వయిలెన్స్ కేసులు 23% తగ్గాయి. రూ.88.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశామని పేర్కొన్నారు.






