
Mana Enadu : ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు (AP Rain Alert) పడే అవకాశం ఉందని ప్రకటించారు. కోస్తాంధ్ర తీరం వెంట ఓడ రేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించినట్లు తెలిపారు.
ఆ జిల్లాలకు వర్ష సూచన
బుధవారం రోజున ఏపీలోని ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు (AP Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
భాగ్యనగరంలో చిరుజల్లులు
మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు (Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మూడ్రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్ మినహా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.