
గత కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమికి మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రాలేకపోతున్నారు. అత్యవసరం అయితేనే పగటిపూట బయటకెళ్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
వడగండ్ల వానలు
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన పడుతుందని వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ముఖ్యంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో శుక్ర, శని వారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.