
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో, రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు(Temparatures) పెరుగుతాయని వెల్లడించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు పాటించండి: IMD
కాగా సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉప్పల్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన వాన పడింది. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ పేర్కొంది.
అకాలం.. రైతులకు అనంత నష్టం
కాగా అకాల వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం(Damage to crops) వాటిల్లింది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని చామాపూర్‌లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.