సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ ముగ్గురి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ పక్కా. ఇదే అంచనాలతో రిలీజ్ అయింది గేమ్ ఛేంజర్(Game Changer review telugu) సినిమా. జనవరి 10వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అంచనాలు, ఆసక్తికి దీటుగా ఉందా?(Game Changer Review) ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
చిత్రం: గేమ్ ఛేంజర్
నటీనటులు: రామ్‌చరణ్, కియారా అడ్వాణీ, అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: సమీర్ మహ్మద్, రుబెన్
కథ: కార్తిక్ సుబ్బరాజ్
నిర్మాత: దిల్‌రాజు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.శంకర్
విడుదల: 10-01-2025
రేటింగ్ : /5
స్టోరీ ఇదే
రామ్ నందన్ (Ram Charan) ఐపీఎస్ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన దీపిక (Kiara Advani) కోసం కోపాన్ని తగ్గించుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయి విశాఖ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. అక్కడ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో గొడవ షురూ అవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్). మరి.. పదవి కోసం ఆరాటపడే మోపిదేవి సీఎం అవ్వడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? దానికి అడ్డొచ్చిన ఐఏఎస్ రామ్‌నందన్‌ని ఏం చేశాడు? సమర్థుడైన రామ్.. మోపిదేవిని ఎలా ఎదుర్కొన్నాడు? అభ్యుదయ పార్టీ, అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (Anjali)తో రామ్‌కి ఉన్న సంబంధమేమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే?
ఓ ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య సాగే యుద్ధమే గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Review). శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ మినహా… కథనం పరంగా, భావోద్వేగాల పరంగా పెద్దగా ఆకట్టుకోదు. శాసన వ్యవస్థ, ఎన్నికల సంఘం చుట్టూ సాగే సంఘటనల సమాహారంగా సాగే సినిమా ఇది. చిత్రంపై ఎంతో హైప్ క్రియేట్ చేసిన శంకర్.. సినిమాను పూర్తి నాటకీయంగా, సహజత్వానికి దూరంగా తీశారు. సినిమా ఇక పట్టాలపైకి వస్తుందనుకునేలోగానే.. రామ్ ఫ్లాష్‌బ్యాక్ పక్క దారి పట్టిస్తుంది. ఇంటర్వల్ సీన్ లో వచ్చే ట్విస్టు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో అప్పన్న ఎపిసోడ్‌లో శంకర్ మేజిక్ కనిపిస్తుంది. అప్పన్న ఎపిసోడ్ అవ్వగానే మళ్లీ రొటీన్ దారిలోకి వచ్చేసింది సినిమా.
ఎవరెలా చేశారంటే?
రామ్‌చరణ్ మూడు కోణాల్లో సాగే పాత్రలో అలరించాడు. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, అప్పన్నగా, ఐఏఎస్ అధికారిగా తన నటనతో పాటు లుక్స్ కూడా అదిరిపోయాయి. అప్పన్న పాత్రలో మాత్రం యాక్టింగ్ ఇరగదీశాడు. కియారా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఆమె అందంతో ఆకట్టుకుంటుంది. అంజలి పాత్ర మాత్రం సినిమాకు బలంగా నిలిచింది. ఆమె నటనకి ప్రాధాన్యమున్న పార్వతి పాత్రలో అలరించింది. ఆమె పాత్ర నేపథ్యంలోనే ఎమోషన్ బాగా పండింది. ఇక ఎస్ జే సూర్య ఎప్పటిలాగే తన మ్యాజిక్ చూపించాడు. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలైట్. మిగతా వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
శంకర్ సినిమాలో విజువల్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతి సీన్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక తమన్ ఎప్పటిలాగే తన బీజీఎంతో అదరగొట్టాడు. పాటల కంటే ఈ సినిమాలో బీజీఎం ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. కూరలో అన్నీ కుదిరి ఉప్పు మాత్రం సరిపడా లేనట్లు.. సినిమాలో అన్ని హంగులున్నా.. కథ, రచన పరంగా లోటు జరగడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. నిర్మాణం పరంగా దిల్‌రాజు, శిరీష్ బాగా ఖర్చు పెట్టారు.
ప్లస్ పాయింట్స్
- + రామ్‌చరణ్ నటన
- + తమన్ బీజీఎం
- + విజువల్స్
మైనస్ పాయింట్స్
- – పాత కథ, కథనం
- – కొరవడిన ఎమోషన్
కన్ క్లూజన్ : రామ్ చరణ్ ‘గేమ్’ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఆడాల్సింది






