వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ శ్రీకాంత్‌బాబు ఆర్జీవీని విచారిస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం (Vyooham)’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలువురు కీలక నేతలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యక్తిత్వాలను కించపరిచేలా అనుచిత పోస్టులు చేశారు.
అనుమతి లేకుండా గైర్హాజరు
వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. తాను సినిమా షూటింగులో బిజీగా ఉన్నానని.. వీలున్నప్పుడు వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. అలా పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు.
హైకోర్టుకు ఆర్జీవీ
తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని వర్మ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. ఈ క్రమంలో సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపగా నేడు వర్మ విచారణకు హాజరయ్యారు.






