Mana Enadu : ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్జీవీ.. మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు.
జైల్లో కథలు రాసుకుంటా
‘‘సోషల్ మీడియాను రెగ్యులరైజ్ చేయడం చాలా కష్టం. చట్టంలో నాకున్న అవకాశాలను బట్టి పోలీసులకు నేను సమాధానం ఇచ్చాను. నేను హైదరాబాద్‌లో ఉండి లైవ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. పోలీసులు ఇంకా నన్ను పట్టుకోలేదని చాలా మంది అంటున్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే నేను జైలుకెళ్తా. అక్కడ ఖైదీలతో స్నేహం చేస్తాను. వారితో మాట్లాడి నాలుగు సినిమా కథలు రాసుకుంటాను.
ఏడాది తర్వాత ఈ రియాక్షన్ ఏంటో?
గత కొన్నేళ్లుగా నా ఎక్స్ అకౌంట్(RGP Tweets)లో వేల పోస్టులు పెడితే.. వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత అంటున్నారు. సంవత్సరం తర్వాత నలుగురైదుగురు ఒకేసారి స్పందించడమేంటి? వివిధ జిల్లాల్లో నాపై కేసులు పెట్టారు కానీ.. నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల నేను హాజరు కాలేను. ఈ విషయాన్ని కోర్టుకు విజ్ఞప్తి చేశాను. నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి నా డెన్ కు వచ్చిన కొన్ని మీడియా సంస్థలు నేనక్కడ లేకపోవడంతో పరారీలో ఉన్నాడని కథనాలు అల్లాయి’’ అని వర్మ అన్నారు.
డిటెక్టివ్ గా మారిన మీడియా
తన కోసం కేరళ, కోయంబత్తూరులో పోలీసులు జల్లెడ పడుతున్నారని రాశారని ఆర్జీవీ తెలిపారు. తన అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి అధికారికంగా చెప్పలేదు కదా అని అన్న ఆయన.. లేని న్యూస్‌ను కొందరు కావాలని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్ , నాగార్జున (Nagarjuna) తనను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసిందని.. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్‌గా మారిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.






