ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) మరోసారి పోలీసులు నోటీసులు అందించారు. బన్నీ.. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్‌పేట్ పోలీసులు తాము ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు. మరోవైపు ఆదివారం కూడా బన్నీకి రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
మా సూచనలు పాటించాలి
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sri Teja)ను పరామర్శించేందుకు రావొద్దని అందులో ఆదివారం ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని .. పరామర్శకు వెళ్తే తమ సూచనలు పాటించాలని సూచించారు. మరో ఘటన ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ ఘటన
పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Case)లో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన శ్రీతేజ్ అనే బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఏ11గా భావిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెయిల్ పై వచ్చిన ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.






