తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభించిన ఉచిత సన్నబియ్యం పథకం లక్షలాది పేద ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ, ఆకలి తీరుస్తోంది. ఈ పథకం ప్రకారం ఒక్కో లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందిస్తున్న నేపథ్యంలో, లబ్ధిదారులకు 18 కిలోల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తోంది.
అయితే, ఈ పథకాన్ని కొంతమంది లబ్ధిదారులు వ్యాపార అవకాశంగా మార్చుకోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా పొందిన బియ్యాన్ని తిరిగి అమ్మకానికి పెట్టడాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వేలాది కిలోల బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి అమ్మకానికి సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..
ఇది ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి దుర్వినియోగ ఘటనలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ చర్యలు ప్రభుత్వ సంకల్పాన్ని కించపరచేలా ఉన్నాయని అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ సన్నబియ్యాన్ని దుర్వినియోగం చేస్తే రేషన్ కార్డులు రద్దు చేస్తామని అధికార యంత్రాంగం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
రేషన్ కార్డులు రద్దు.. అధికారులు హెచ్చరిక
పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, “ఇది ఉచిత రేషన్. ఆకలితో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకే ఈ బియ్యం అందించబడుతోంది. లాభం కోసం విక్రయించడమంటే, ప్రభుత్వ ఉద్దేశాన్ని మోసం చేయడమే” అని అన్నారు. ఉచిత బియ్యాన్ని అమ్మితే సంబంధిత లబ్ధిదారుల రేషన్ కార్డులు రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు.
ఇక ఉచిత బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇది చట్ట విరుద్ధ చర్యగా పరిగణించబడుతుంది అని ప్రజలకు స్పష్టం చేశారు.
అధికారులు మరింత గట్టి చర్యలకు సిద్ధం
తాజాగా మంగళవారం(ఈ రోజు) ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీనివాస్ నగర్, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి పలు రేషన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక నిబంధనల ఉల్లంఘనలు బయటపడడంతో సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజంగా అవసరమున్న వారికి అందించాలన్న ఉద్దేశం విజయవంతం కావాలంటే, ప్రజల సహకారం కూడా కీలకమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలకు సూచనలు
ఉచిత బియ్యాన్ని కేవలం కుటుంబ అవసరాలకే ఉపయోగించాలి.
బియ్యం విక్రయించడం వల్ల తాత్కాలిక లాభం కలగొచ్చు కానీ, దీర్ఘకాలంలో రేషన్ కార్డు రద్దు అవుతుంది.
ఎవరైనా బియ్యాన్ని అమ్ముతూ లేదా కొనుగోలు చేస్తూ కనిపిస్తే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన శిక్షలు తప్పవు.






