శ్రీశైలం ఎడమగట్టు SLBC టన్నెల్ ప్రమాదం(Tunnel Accident) జరిగి నేటికి 28 రోజులు గడిచిపోయాయి. కానీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటికి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా ఏడుగురు కార్మికుల(Workers) కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ల ఎండ్ పాయింట్ వరకు రెస్క్యూ సిబ్బంది వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో, తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఆదేశాల మేరకు చెన్నై(Chennai)కి చెందిన IIIT రోబోలను రంగంలోకి దించారు.

భారీ ఊటతో సహాయక చర్యలకు ఆటంకం
వీటి ద్వారా మనుషులు వెళ్లలేని ఎండ్ పాయింట్లో రోబో(Robo)ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని అంతా భావించినప్పటికీ, టన్నెల్ లో నెట్వర్క్ సిగ్నల్(Network Signal) సరిగా లేకపోవడంతో రోబోలతో చేసే సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్(Cadaver Dogs) గుర్తించిన అనుమానిత ప్రదేశాలను D1, D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకుని ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. మొదట D1 పాయింట్ లో తవ్వకాలు చేపట్టిన సిబ్బంది 8 మీటర్ల లోపలి వరకు తవ్వినా ఎలాంటి ఫలితం దక్కలేదు. పైగా భారీ దుర్వాసన వస్తుండడం, మృతదేహాలు ఆ చుట్టుపక్కలే ఉంటాయన్న అనుమానంతో మరోసారి క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు చేపట్టి D2 పాయింట్‌లో ముమ్మరంగా తవ్వకాలు చేపడుతున్నారు. కానీ ఆ ప్రదేశంలో భారీగా ఊట నీరు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

కుటుంబీకుల ఆందోళన
కాగా గతనెల 22న నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC టన్నెల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ ఇంజినీర్(Engineer)తోపాటు మరో ఏడుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. మిగతా వారికోసం రెస్క్యూ చర్యలు(Rescue Operations) అవిశ్రాంతంగా కొనసాగుతున్నా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదు. ఇదిలా ఉండగా తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారనోనని ఆ కార్మికుల బంధువుల రోదనలు కన్నీరుపెట్టిస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికి వస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ప్రమాదం జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుండటంతో వారంతా టన్నెల్‌లోనే సజీవ సమాధి అయినట్లు పలువురు భావిస్తున్నారు.







