
కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు (Ration Cards) గుడ్ న్యూస్. ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ, వార్డు సభలు నిర్వహించి రేషన్ కార్డులు అర్హులను ప్రకటించిన విషయం తెలిసిందే.
నాలుగు జిల్లాలు.. లక్ష దరఖాస్తులు
గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన మిగతా లబ్ధిదారులను అధికారులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం నాలుగు జిల్లాల్లో కలిపి 1,01,103 దరఖాస్తులు వచ్చాయి.
అర్హులకు రేషన్ కార్డులు
గత నెలలో మండలానికో గ్రామంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులకు ఈనెల నుంచే బియ్యం (Ration Rice) పంపిణీ జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలకు కార్డులు, లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుందని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీ, సభ్యుల పేర్లు చేర్చడం, అనర్హుల పేర్లు తొలగించడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులందరికి రేషన్ కార్డులు వస్తాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.