కన్నడలో ఓ సింపుల్ రీజినల్ సినిమాగా ప్రారంభమైన ‘కాంతార’(Kantara) దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కాంతార ఛాప్టర్ 1’ (Kantara Chapter-1) (కాంతార 2)(kantara2) షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో కూడా రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలూ ఆయనే నిర్వహిస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్(Hombale Films)) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సోమవారం ‘కాంతార జర్నీ’ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో దట్టమైన అడవుల మధ్య, వాటర్‌ఫాల్స్ పక్కన వేసిన భారీ సెట్స్, వేలమంది కష్టానికి ప్రతిబింబంగా చిత్రీకరణను చూపించారు. ఈ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ, “మన ఊరు, మన జనం, మన నమ్మకాలతో కూడిన కథను ప్రపంచానికి చెప్పాలనే కలతో ఈ సినిమా తీశాను. ప్రతిరోజూ సెట్‌లో వేలమందిని చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు… ఒక శక్తి లా అనిపించింది” అని అన్నారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేశారు.
ఇక ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను అక్టోబర్ 5న దేశవ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భక్తి, పుట్టిన ప్రాంతపు నమ్మకాల ఆధారంగా నడిచే ఈ కథకు దేశవ్యాప్తంగా విభిన్నమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి మరోసారి తన ప్రత్యేక శైలి సినిమాతో ప్రేక్షకులను మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు.






