ఊహించని అదృష్టం తలుపు తడితే ఆ సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తాజాగా అలాంటి ఓ అదృష్టం.. కాదు కాదు అంతకుమించి.. ఓ కుటుంబం తలుపుతట్టింది. 34 ఏళ్ల క్రితం పెట్టిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు ఏకంగా రూ.80 కోట్లు తెచ్చిపెట్టింది.
వివరాల్లోకి వెళితే.. 1990లో ఓ వ్యక్తి ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్షను షేర్ల రూపంలో పెట్టుబడిగా పెట్టారు. ఆ కాలంలో అది పెద్ద మొత్తమే అయినా, సంవత్సరాలు గడుస్తుండటంతో ఆయన ఆ పెట్టుబడి గురించి పూర్తిగా మర్చిపోయారు. సంబంధిత పత్రాలు ఇంట్లో ఎక్కడో ఒక మూలన పడేసి అలాగే వదిలేశాడు. అయితే ఇటీవల అతని కుమారుడు ఇంట్లో పాత కాగితాలు వెతుకుతుండగా.. ఆ షేర్లకు సంబంధించిన పత్రాలు దొరికాయి.
Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.
Worth ₹80Cr today.
Power of buy right sell after 30yrs. pic.twitter.com/mZTpGt4LII
— Sourav Dutta (@Dutta_Souravd) June 7, 2025
ఆసక్తితో వాటిని పరిశీలించి ప్రస్తుత మార్కెట్ విలువ తెలుసుకోగా, ఆ షేర్ల విలువ ప్రస్తుతం ఏకంగా రూ.80 కోట్లు అని తెలిసింది. ఈ సమాచారం వారి కుటుంబానికి ఆశ్చర్యం కలిగించడమే గాక పట్టలేని ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఈ సంఘటన స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంతటి అద్భుతమైన ఫలితాలను అందించగలదో స్పష్టంగా చెబుతోంది. సరైన కంపెనీలో, సరైన సమయంలో పెట్టిన పెట్టుబడి ఎంత భారీగా మారుతుందో ఇది ప్రత్యక్ష నిదర్శనం.
ఈ వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సౌరవ్ దత్తా అనే నెటిజన్ ఈ అంశాన్ని తన ‘ఎక్స్’ (మాజీగా ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నాడు. ఇది నెటిజన్లను ఆకర్షిస్తూ, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాధాన్యతపై చర్చనీయాంశంగా మారింది.






