Mana Enadu : పరమేశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది కార్తిక మాసం (Karthika Masam). ఈ మాసంలో దీపారాధన చేస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. కార్తిక పౌర్ణమి రోజున 365 వొత్తులతో దీపారాధన చేస్తే.. ఏడాది పొడవున ఆ శివయ్య ముందు దీపం వెలిగించినట్లని పండితులు చెబుతుంటారు.
కార్తీక దీపాలతో వెలుగులు
ఈ నేపథ్యంలో కార్తిక పౌర్ణమి (Karthika Poornima) రోజున భక్తులంతా దీపారాధన చేస్తుంటారు. ఇవాళ కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మరోవైపు పూర్ణిమ సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రాజన్న సన్నిధిలో భక్తుల కిటకిట
వేకువజామునే కుటుంబంతో సహా శైవాలయాలకు చేరుకున్న భక్తులు.. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Vemulawada Temple) భారీగా భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో శివయ్య దర్శనానికి సాధారణం కంటే కాస్త ఎక్కువ సమయం పడుతోంది. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లోనూ భక్తులు కిటకిటలాడుతున్నారు.
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
ఇక ఏపీలోని శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం (Sri Sailam Temple)లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించి కార్తీక దీపాలు (Karthika Deepam) వెలిగించారు. ఇలా తెలుగు రాష్ట్రాలు కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి.






