Mana Enadu : ఏడాదిలో ఎన్ని పండుగలు వచ్చినా దీపావళి పండుగ(Diwali Festival)కు ఉండే కళే వేరు. వృత్తి, విద్య, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో సొంతూరును, కన్న వాళ్లను వదిలి వెళ్లిన వారంతా ఎక్కడున్నా తమ ఇళ్లకు చేరతారు. అంతా కలిసి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ వెలుగుల పండుగ దీపాలతోనే కాదు.. కన్నవాళ్లకు తమ పిల్లలను, పిల్లల్ని కన్నవాళ్లకు దగ్గర చేసి వారి జీవితాల్లో వేయి దీపాల కాంతులను వెలిగిస్తుంది. అందుకే చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే ఈ ఆనందాల వేడుక అంటే అందరికీ ఇష్టమే.
ఇక ఈ పండుగ రోజున పిల్లలతో పాటు పెద్దలు కూడా బాణసంచా(Diwali Crackers) కాల్చి జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇక పిల్లలకు అయితే కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, పాము బిల్లలు, లక్ష్మీ బాంబులు, సుతిల్ బాంబులు ఇలా రకరకాల టపాసులను పేలుస్తూ సందడి చేస్తుంటారు. కొంతమంది పిల్లలు టపాసులు పేల్చడానికి భయపడుతుంటే వారి తల్లిదండ్రులు దగ్గరుండి సాయం చేస్తుంటారు.
అయితే టపాసులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ దీపావళికి ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాలీగా టపాసులు (Diwali Bombs) పేలుస్తూ హాయిగా కుటుంబంతో గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. మరి అవేంటంటే..?
టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి
ప్రమాదకరమైన బాణాసంచాను పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది
టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ చేతులకు పూసుకోకూడదు
పొగ ఎక్కువ వచ్చే బాణాసంచాను వాడకూడదు
విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగల వద్ద టపాసులు పేల్చొద్దు
టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి
టపాసులు అంటించిన తర్వాత వాటికి ముఖం దగ్గరగా పెట్టొద్దు
ముందు జాగ్రత్తగా నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోవాలి
పండుగ పూట పిల్లలను ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉంచాలి.