Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) వేళ దేశవ్యాప్తంగా అందరూ ఇంటిల్లిపాది సరదాగా గడుపుతున్నారు. సాయంకాలం వేళ లక్ష్మీదేవి పూజలో నిమగ్నమయ్యారు. అయితే ఓవైపు పెద్దలు పూజలో బిజీగా ఉండగా.. మరోవైపు పిల్లలు టపాసులు పేల్చుతున్నారు. గల్లీ నుంచి దిల్లీ దాకా దేశవ్యాప్తంగా టపాసుల శబ్ధంతో మోతెక్కుతోంది.
అయితే టపాసులు (FireCrackers) కాల్చే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మనమే కాకుండా వాహనాల విషయంలోనూ కాస్త అప్రమత్తత అవసరం. లేదంటే అగ్నిప్రమాదాలు జరిగి వాహనాలు కాలి బూడిదయ్యే అవకాశం ఉంది. మరి అలా జరగకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
ప్రస్తుతం గల్లీకో బాణాసంచా దుకాణాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మీ వాహనాలను ఆ దుకాణాల దగ్గర అస్సలు ఉంచకండి. పొరపాటున అక్కడ ప్రమాదం జరిగితే ఆ మంటలు అంటుకుని మీ వాహనం బూడిదయ్యే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు టపాసులు పేల్చే ప్రాంతానికి కూడా దూరంగా ఉంచండి.
చాలా మంది తమ వాహనాలు షెడ్డులో కాకుండా ఓపెన్ ప్లేసులలో పార్క్ చేస్తుంటారు. అలాంటి వారు వీధుల్లో పార్క్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాలుస్తుంటారు.
ఇక వాహనాలు పార్క్ చేసిన తర్వాత చాలా మంది దుమ్ము పడకుండా కవర్ కప్పుతారు. సాధారణ రోజుల్లో అయితే దీనివల్ల నో ప్రాబ్లెం. కానీ దీపావళి వేళ మాత్రం ఇది కాస్త ముప్పు తెచ్చే అవకాశం ఉంది. టపాసులు కాల్చే సమయంలో నిప్పురవ్వ ఎగిసి ఈ కవర్ పై పడితే మంట చెలరేగి మీ వాహనం కాలిపోవడం ఖాయం.