
Mana Enadu : సంకష్ట చతుర్థి (Sankashtahara Chaturthi) ఏర్పడే వారాన్ని బట్టి పేరు మారుతుంది. బుధవారాన్ని సౌమ్య వారం అని కూడా అంటారు. ఈ సంకష్ట చతుర్థి బుధవారం ఏర్పడితే దాన్ని సౌమ్య సంకష్ట చతుర్థి అంటారని పండితులు చెబుతున్నారు. ఇలాంటి విశిష్టమైన రోజున వ్రతం చేస్తే విద్యార్థుల(Students)కు జ్ఞానం సిద్ధిస్తుందని.. వ్యాపారులకు లాభాలు కలిసివస్తాయని శాస్త్రాలు తెలుపుతున్నారు. అంతేగాక.. చేసే పనుల్లో సర్వ ఆటంకాలు తొలగిపోయి విజయాలు వరిస్తాయట. మరి డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున సౌమ్య సంకష్ట చతుర్థి పురస్కరించుకుని ఈ వ్రతం ఎలా జరుపుకోవాలో చూద్దాం?
సంకటహర చతుర్థి వ్రతం ఇలా జరుపుకోవాలి..
సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు లేదా 21 నెలలపాటు ఆచరించాలి. వ్రతం చేసే రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పసుపు కుంకుమలతో అలంకరించిన పీట మీద గణేశుని (Lord Ganesh) ప్రతిమను పెట్టి షోడశ నామాలతో గణపతిని పూజించాలి. ఆ తర్వాత ఓ ఎర్రటి వస్త్రంలో పసుపు కుంకుమలు ఉంచి.. మూడు గుప్పిళ్ల బియ్యం, ఒక తమలపాకులో 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపుకొమ్ములు, 5 వక్కలు, 11 రూపాయలు దక్షిణ ఉంచి మనసులోని కోరికను ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకున్న తర్వాత ముడుపు కట్టాలి. ముడుపును గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో పూజించాలి.
చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించాలి
సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించాలి. అష్టోత్తర శతనామాలతో స్వామికి పూజ చేసి కొబ్బరి కాయలు, పండ్లు, ఉండ్రాళ్లు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత సంకష్ట గణపతి వ్రత కథ చదివి పూజాక్షితలను శిరస్సున వేసుకోవాలి. రాత్రిరూట చంద్రుణ్ని దర్శించిన తర్వాత స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా మీకు వీలైనన్ని నెలలు చేసుకుంటే గణపయ్య మీ ఆటంకాలన్నింటిని హరించి మీరనుకున్న పనుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు.