Mana Enadu : సంక్రాంతి పండుగ (Sankranti Festival) వచ్చేస్తోంది. మరో పదిహేను ఇరవై రోజుల్లో తెలుగు రాష్ట్రాలన్నీ రంగులమయం కాబోతున్నాయి. ఈ క్రమంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది తమ ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాసులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు మూణ్నెళ్ల ముందే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.
సంక్రాంతి సెలవులు
ఇక సంక్రాంతి సెలవులు (Sankranti holidays 2025) ఎప్పటి నుంచి మొదలవుతాయో అని విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) క్లారిటీ ఇచ్చింది. 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2024-25 క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి తెలిపారు. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని వెల్లడించారు.
పండుగకు 4 రోజులే సెలవులు
అయితే ఈ ఏడాది ఏపీని భారీ వర్షాలు (AP Rains 2024) ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వరణుడు మిగిల్చిన విషాదం, నష్టాల నుంచి కొన్ని ప్రాంతాలు తేరుకుంటున్నాయి. అయితే వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ ఏడాది ఏపీలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి ఎక్కువ రోజులు సెలవులు ఉండవనే ప్రచారం సాగింది.
ఆ ప్రచారం అవాస్తవం
కేవలం జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు (Sankranti holidays 2025 in AP) ఉంటాయని ఓ వార్త లేదు లేదు 12 నుంచి 16వ తేదీ వరకు హాలిడేస్ అంటూ మరో వార్త.. ఇలాంటి వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో సంక్రాంతి సెలవులపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని ప్రభుత్వ అధికారి తెలిపారు. 2025 క్యాలెంటర్ ప్రకారం జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.








