ప్రస్తుతం సొసైటీలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్యను ప్రధానంగా చూపిస్తూ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ‘సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. విక్రాంత్, చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో సందడి చేశారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగ సంతాన ప్రాప్తిరస్తు చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.
100 రోజుల్లో ప్రెగ్నెన్సీ
ఇక టీజర్ చూస్తుంటే హీరో విక్రాంత్ (Vikranth) హీరోయిన్ చాందినిని తన ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న చాందిని తండ్రి విక్రాంత్ కు ఓ షరతు విధిస్తాడు. వంద రోజుల్లో తన కుమార్తె తనతో రాకుండా చేయాలని అల్లుడికి ఛాలెంజ్ విసురుతాడు. అయితే చాందిని తన తండ్రితో వెళ్లొద్దంటే తనను తల్లిని చేయాలనే ప్లాన్ వేస్తాడు విక్రాంత్. అలా 100 రోజుల్లో తన భార్యను గర్భవతిని చేసేందుకు హీరో పడే తంటాలతో ఈ చిత్రాన్ని రూపొందించిట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
జాక్ రెడ్డి పాత్ర అదుర్స్
ఈ టీజర్ విడుదల చేసిన అనంతరం సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ.. ‘టీజర్ ప్రామిసింగ్ గా ఉంది, “సంతాన ప్రాప్తిరస్తు” మంచి ఎంటర్ టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ జాక్ రెడ్డిగా నవ్వించాడు.’ అని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.






