పెరగనున్న రైళ్లు, తగ్గనున్న జర్నీ టైం
ముద్ఖేడ్-డోన్ డబ్లింగ్‌కు కూడా ఓకే
గుజరాత్, మహారాష్ట్రకు దక్షిణ భారతం మరింత చేరువ
రూ.32,500 కోట్లతో తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు రైల్వే ప్రాజెక్టులు
గుంటూరు-బీబీనగర్ మధ్య ఉన్న రైలుమార్గం డబ్లింగ్ పనుల(Doubling works)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల సికింద్రాబాద్ విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు గణనీయంగా పెరగడమేగాక ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గుంటూరు-బీబీనగర్ మధ్య ఉన్న రైలుమార్గం డబ్లింగ్ పనుల(Doubling works)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల సికింద్రాబాద్ విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు (Secunderabad and Vijayawada Trains) గణనీయంగా పెరగడమేగాక ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. మరోవైపు, ముద్ఖేడ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ మార్గంలో కూడా ప్రస్తుత లైన్‌ను డబ్లింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌కు దక్షిణ భారతదేశానికి మధ్య ప్రయాణ సమయం నాలుగు గంటలపాటు తగ్గనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు 9 రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ఏడు రైల్వే ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. రూ.32,500 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల దేశంలోని రైల్వే నెట్‌వర్క్ 2,339 కి.మీ.ల మేర పెరుగుతుందని, 7.06 కోట్ల పనిదినాలను ఆయా రాష్ట్రాల ప్రజలకు కల్పిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్యాబినెట్ ఆమోదించిన రైల్వే ప్రాజెక్టులలో నెర్‌గుండి-బరంగ్, ఖుద్రారోడ్-విజయనగరం మూడవ లైను ప్రాజెక్టు ఒడిశాలోని 5 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో అమలవుతుంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రైల్వే నెట్‌వర్క్ పెరుగుతుంది.
క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధానమైన రూట్లలో డబ్లింగ్ పనులకు రూ.7,539 కోట్ల రికార్డు అంచనా వ్యయంతో కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. పనులు పూర్తయితే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రావటంతోపాటు సరకు రవాణా సులభమవుతుందన్నారు. రూ.2,853.23 కోట్ల అంచనా వ్యయంతో బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తయితే విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పారు. బీబీనగర్-గుంటూరు మధ్య సుమారు 239 కి.మీ.ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే కాకుండా దేశంలో దక్షిణ-తూర్పు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రూట్‌గా బీబీనగర్-విజయవాడ గుర్తింపు పొందినట్టు వివరించారు. ముద్ఖేడ్-డోన్ మధ్య డబ్లింగ్ పనులు మహారాష్ట్రలో 49.15 కి.మీ.లు, తెలంగాణలో 294.82 కి.మీ.లు, ఆంధ్రప్రదేశ్‌లో 73.91 కి.మీ.లలో చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని నాందేడ్, తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ, గద్వాల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు విస్తరించినట్టు వివరించారు.