Mana Enadu : మరికాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో ఆయనకు సోమవారం రోజున పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన చిక్కడపల్లి ఠాణాకు వెళ్లనున్నారు.
అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తు
ఈ క్రమంలో ఐకాన్ స్టార్ ఇంటి వద్ద (Allu Arjun House Security) పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. ఇంటికి వెళ్లే దారిలో రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయన నివాసం సమీపంలో ఎవరూ గుమిగూడ కుండా చర్యలు చేపట్టారు. ఆయన చిక్కడపల్లి ఠాణాకు కాసేపట్లో బయల్దేరనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు చేపట్టారు.
లీగల్ టీమ్ తో బన్నీ మంతనాలు
మరోవైపు సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)కు సంబంధించిన కేసులో సోమవారం రోజున పోలీసులు నోటీసులు జారీ చేయగానే అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు సమావేశమై.. విచారణ సమయంలో పోలీసులు అడిగే అవకాశమున్న ప్రశ్నలు.. వాటికి ఎలా స్పందించాలోనన్న విషయాలపై చర్చించారు. ఇక అల్లు అర్జున్‌ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేశ్ కుమార్‌తోపాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నట్లు తెలిసింది.
బన్నీపై ప్రశ్నల వర్షం
ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు ఇటీవల వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఆధారంగా పోలీసులు బన్నీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదే విధంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ (Allu Arjun Press Meet) నిర్వహించగా.. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలపైనా పోలీసులు బన్నీని ఆరా తీయనున్నట్లు సమాచారం.






