మరో నెలరోజుల్లో ఆసియా కప్ (Acia Cup-2025) ప్రారంభం కానుంది. UAE వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు(Team India) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. BCCI సెలక్టర్లు ఈనెల చివరి వారంలో 15-17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించనున్నారు. IPL-2025, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్(England Test series)లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపికలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఈసారి జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై సెలక్టర్లకు తలనొప్పి ఖాయంగా కనిపిస్తోంది. టీ20ల్లో సత్తాచాటుతున్న అభిషేక్ శర్మ, రుతురాజ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇస్తారా? లేక పాత పద్ధతిలాగే సీనియర్లకు చోటు కల్పిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.

కీపర్‌గా శాంసనా? ఇషాన్ కిషనా?
టీ20లకు కెప్టెన్సీ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadhav) స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకుంటున్నందున, హార్దిక్ పాండ్య(Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చని సమాచారం. ఇక శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సాయి సుదర్శన్ IPL 2025లో 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్(Orange Cap) గెలిచి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar), ఐపీఎల్‌లో 604 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చి, మిడిల్ ఆర్డర్‌లో స్థానం కోసం బలమైన పోటీదారుగా నిలిచాడు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ మొదటి ఎంపికగా కనిపిస్తున్నాడు. అయితే ఇషాన్ కిషన్, ఐపీఎల్‌లో 354 పరుగులతో, రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. రిషభ్ పంత్ గాయం కారణంగా ఆడే అవకాశం లేదు.

ఆల్‌రౌండర్లు.. బౌలింగ్ విభాగంలో మార్పులు చేస్తారా?
ఇక ఆల్‌రౌండర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అటు పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(Bumrah), మహ్మద్ సిరాజ్(Siraj)లకు ఫిట్‌నెస్ టెస్ట్‌లు కీలకం. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా రేసులో ఉన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లు ప్రధాన ఎంపికలుగా కనిపిస్తున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2026)ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులను కలిపి బలమైన జట్టును రూపొందించేందుకు సెలక్టర్లు(Selectors) ప్రయత్నిస్తున్నారు.







