Mana Enadu : పదవీ విరమణ తర్వాత కూడా క్రమంగా ఆదాయం పొందుతూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ అనుకుంటారు. అలాంటి సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(Senior Citizen Savings Scheme). ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లు(Senior Citizens) ప్రతి నెలా దాదాపు రూ.20 వేల వరకు డబ్బు సంపాదించవచ్చు.
నష్టభయం ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్(Mutual funds)లో ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇతర ప్రభుత్వ పథకాలతో పోల్చితే ఇందులో వడ్డీరేటు(interest rate) కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. SCSS ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి పెట్టుబడుల భద్రత గురించి ఎలాంటి భయం అవసరం లేదు. ఈ పథకంలో చేరాలంటే సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకుల(Post office or banks)ను సంప్రదించాలి. SCSS ఖాతా తెరచి డబ్బు డిపాజిట్ చేయాలి.
అర్హతలు ఇవే
☛ 60 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వారైతే 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.
☛ ఇండియన్ డిఫెన్స్ సర్వీసు(Indian Defense Services)లో పని చేసి పదవీవిరమణ పొందినవారు 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు.
☛ భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. NRIలకు అవకాశం లేదు.
పెట్టుబడులు, కాలపరిమితి
☛ కనీస పెట్టుబడి(Investment) వెయ్యి రూపాయలతో కూడా ఈ పథకంలో చేరొచ్చు.
☛ గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఇందులో పొదుపు చేయవచ్చు.
☛ ఒకరు ఎన్ని SCSS ఖాతాలైనా తెరవొచ్చు. కానీ, అన్నింటిలో కలిపి గరిష్ఠ పెట్టుబడి రూ.30 లక్షలు మించకూడదు.
☛ ఈ పథకాన్ని 5 ఏళ్ల వరకు కచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుంది.
☛ ఐదేళ్ల కాలపరిమితి పూర్తయ్యాక, ఈ పథకాన్ని మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఉపసంహరణ ఎలా అంటే?
✪ ఐదేళ్ల వరకు పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు వీలు ఉండదు. ఒకవేళ ఖాతాను మూయాలనుకుంటే డిపాజిట్ మొత్తంపై 1% నుంచి 1.5% వరకు కోత విధిస్తారు.
✪ జీవిత భాగస్వామితో కలిసి కూడా SCSS ఖాతాను తెరవొచ్చు. కాబట్టి ఖాతాదారుల్లో ఒకరు మరణించినా, మరొకరి పేరు మీద వ్యక్తిగత ఖాతా కొనసాగుతుంది.
✪ వ్యక్తిగత ఖాతాదారులు కాలపరిమితికి ముందే మరణిస్తే.. పెట్టుబడి సొమ్ముకు వడ్డీని కలిపి ఆ మొత్తాన్ని నామినీ/వారసులకి అందజేస్తారు.
✪ మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు తమ మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవడానికి విత్‌డ్రాయల్ ఫారంతో పాటు పాస్‌బుక్ సమర్పించాల్సి ఉంటుంది.
✪ ఒకవేళ మరో మూడేళ్లు ఈ పథకంలో కొనసాగాలనుకుంటే.. ఓ సాధారణ పోస్టాఫీస్ పొదుపు ఖాతాలా భావించి మీకు వడ్డీ డబ్బులు చెల్లిస్తారు.
✪ ఈ స్కీంలో పెట్టుబడులతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.






