Mana Enadu : కార్తిక మాసం (karthika masam) హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది. స్థితికారకుడైన హరి, శుభంకరుడైన హరుడి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలను ఇవ్వాలనే ప్రతీక ఈ మాసంగా చెబుతుంటారు. ఇక కార్తిక మాసం అందులోనూ శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన వారాన్ని కోటి సోమవారం అంటారు. ఈ నవంబరు 9వ తేదీన వ్యవహరిస్తారు. ఆరోజు దీపారాధన చేస్తే ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
కార్తిక మాసంలో.. స్నానం.. దీపం.. దానం.. అభిషేకం.. ఉపవాసం.. వంటివి విశేషమైన ఫలితాన్నిస్తాయి. సాధారణంగా చేసే దీపారాధనకు.. కార్తిక మాసంలో చేసే దీపారాధనకు వ్యత్యాసం ఉంది. దీపానికి ఆధారం బ్రహ్మ.. దానిలో వేసే వత్తి ఈశ్వర స్వరూపం. నూనె/నెయ్యి సాక్షాత్తూ విష్ణు స్వరూపం.. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడి తత్వం కలిగి దీపాన్ని వెలిగించడమే దీపారాధన అంతరార్థం.
ఆ దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉండటం వల్ల ఆయన కార్తికేయుడు అయ్యాడు. ఈ నెలలో కృత్తిక నక్షత్రం దర్శనం చేసుకుని నిత్యం తెల్లవారుజామున ఆకాశంలో చుక్క ఉండగా స్నానం చేయాలంటారు. ఈసారి నవంబరు 9న వచ్చిన శనివారాన్ని కోటి సోమవారంగా (koti somavaram 2024 date telugu) వ్యవహరిస్తారు. కార్తిక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండే రోజును కోటి సోమవారం అంటారు. ఈ రోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే, తప్పుల వల్ల కలిగే పాపం పోతుంది. కోటి శివ లింగాలను పూజించిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.