Mana Enadu : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనికి ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లు (One Nation One Election Bill)ను కేంద్రం మంగళవారం (డిసెంబరు 17న) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేసే అవకాశాలున్నట్లు వెల్లడించాయి.
ఈనెల 17న లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు
ఈ నెల 17వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపించాలని.. స్పీకర్ ఓం బిర్లాను ఆయన అభ్యర్థించనున్నారు. ఆ తర్వాత దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని స్పీకర్ పార్టీలను కోరతారు.
ప్యానెల్ కమిటీ ఏర్పాటు
17వ తేదీ సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటిస్తారు. పార్లమెంట్(Parliament Sessions)లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు ఉంటుంది. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక సభ్యుడు కమిటీ ఛైర్మన్ గా ఉండనున్న ఈ కమిటీకి 90 రోజుల సమయం కేటాయించి అవసరాన్ని బట్టి ఆ సమయాన్ని పొడిగిస్తారు.
కోవింద్ కమిటీ సిఫార్సు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జమిలి (Simultaneous Polls) ప్రణాళికకు ఇటీవల కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. స్థానిక సంస్థల ఎన్నికలను పక్కనబెట్టి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు కేంద్రం ఈనెల 12న ఆమోదం తెలిపింది.






