Mana Enadu : మద్యం దుకాణాలను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోసం భారీగా పోటీ నెలకొంది. భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే లిక్కర్ బిజినెస్ (Liquor Business) లో ఎలాంటి అనుభవం లేని వారు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, ఆడిటర్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఒక్కో షాపునకు భారీగా పోటీ
ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు (Wine Shop Appliactions) వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే సీరియస్‌గా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో వారు మాత్రమే పోటీపడేలా ఈసారి దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు పెట్టి దాన్ని నాన్ రిఫండబుల్ అమౌంట్‌గా (Non-refundable amount) పేర్కొంది.
దరఖాస్తు రుసుం చెల్లించేందుకు 6 వాయిదాలు
ఇలాగైతే వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు వస్తారని అంచనా వేసింది. ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్సు ఫీజు చెల్లించటానికి గతంలో 3 వాయిదాలే ఉండేవి. ప్రస్తుతం దాన్ని 6 వాయిదాలకు కూటమి ప్రభుత్వం పెంచింది.
వైన్ షాపు అప్లికేషన్లకు ఆరోజే ఆఖరు
ఇక దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆసక్తి ఉన్న టెండరుదారులు దరఖాస్తులను వారి ఇంటి వద్దనే కూర్చుని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్లైన్ సెంటర్‌కు వెళ్లినా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు లక్షల రూపాయలు చలానాలు చెల్లించి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. పదో తేదీన కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు.