దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు తమ దేశ ప్రజలను క్షమాపణ కోరాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయనని పశ్చాత్తాప పడ్డాడు. అసలు ఏమైంది? దేశ ప్రజలకు అధ్యక్షుడు ఎందుకు క్షమాపణలు చెప్పాడో చూద్దాం రండి..
దక్షిణ కొరియాలోని ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారని ఆక్షేపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) ఇటీవల దేశలో ఎమర్జెన్సీ మార్షల్ లా ( martial law declaration) విధించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతోపాటు దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాల నేతలు పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టి వెంటనే ఆమోదించారు. ఈ తీర్మానం 190–0తో నెగ్గింది. దీంతో కొద్దిసేపటికే ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
దేశవ్యాప్తంగా వ్యతిరేకత
ఈ పరిణామాలతో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచి కూడా మద్దతు లభించలేదు. యూన్ సుక్ యోల్ తన పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు.. పార్లమెంట్లో (parliament) అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానంపై పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్‌లో అధ్యక్షుడికి వ్యతిరేకంగానే అధిక ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఆయన అధ్యక్ష పదవి కోల్పోవడం ఖాయం.
ఈ నేపథ్యంలోనే యూన్ ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. సీటులో నుంచి లేచి నిల్చొని క్షమించాలని కోరారు. ‘ఎమర్జెన్సీ మార్షల్ లా కారణంగా ప్రజలను ఆందోళనకు, అసౌకర్యానికి గురిచేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇంకోసారి ఎమర్జెన్సీ విధించే ప్రయత్నం చేయబోనని హామీ ఇస్తున్నా. ప్రకటన కోసం నా రాజకీయ, చట్టపరమైన బాధ్యతను తప్పించుకోలేను’ అని పేర్కొన్నారు.






