Mana Enadu : ఏపీ వాసులకు గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగ (Sankranti Festival)కు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. పండుగకు హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు (Special buses) నడపనున్నట్లు తెలిపింది. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2,400 బస్సులను అదనంగా నడపనున్నట్లు వెల్లడించింది. జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజన్ ఎల్. విజయలక్ష్మి తెలిపారు.
సాధారణ ఛార్జీలతోనే బస్సులు
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు (Sankranti Special Buses) బయల్దేరతాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి లేదా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.
ఘనంగా సంక్రాంతి సెలబ్రేషన్స్
ఏపీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది ఏపీ వాసులు హైదరాబాద్లో వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల రీత్యా సెటిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతి సంక్రాంతికి వారు సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందుకోసం రెండు మూడు నెలల నుంచే టికెట్లు బుక్ చేసుకుంటారు. పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ, ఏపీ ఆర్టీసులు కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతుంటాయి. ఎన్ని సర్వీసులు నడిపినా ప్రతి పండుగ సమయంలో రద్దీ మాత్రం భారీగా ఉంటోంది. మరి గత తప్పులు పునరావృతం కాకుండా అధికారులు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.







