Mana Enadu : కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌కు కూతవేటు దూరంలో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అలా మూడు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పండుగలను ఇక్కడి ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఒకటి ప్రకృతి ఒడిలో రైతులు జరుపుకునే ఎలమాస పండుగ (Elamasa Festival). పంట దిగుబటి దండిగా రావాలని లక్ష్మీ దేవికి పూజలు చేస్తూ రైతులంతా తమ కుటుంబాలు, బంధు మిత్రులతో కలిసి పంట పొలాల్లో ఈ పండుగను జరుపుకుంటారు.
జొన్న మొక్కలతో గుడి
ప్రతి ఏటా అమావాస్య రోజున (వార్షిక పండుగ) ఈ పండుగను నిర్వహిస్తారు. అమావాస్య రోజున జరుపుకునే పండుగ కావడంతో ఈ పండుగను ఎలమాస్య పండుగ అంటారు. ఇక ఇక్కడ రబీలో ఎక్కువగా ఆరు తడి పంటలు పండిస్తున్నారు. అందుకే రైతులంతా కలిసి తమ బంధుమిత్రులతో ఈ పండుగలో భాగంగా జొన్న మొక్కలతో గుడి కడతారు. లక్ష్మీదేవి, రెండు ఎడ్లు, రైతు విగ్రహాలను మట్టితో తయారు చేసి కుటుంబ సభ్యులతో పొలానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.
అంబలి కుండకు తాళిబొట్టు
ఎలమాస పండుగ నాటికి లక్ష్మీదేవి గర్భవతిగా ఉన్నట్లు భావిస్తారు. అందుకే కడుపులో బిడ్డను మోస్తున్న లక్ష్మీదేవిని సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాలనే ఉద్దేశంతో సీమంతం చేయడానికి అలంకరించి పూజలు చేస్తారు. అంబలి కుండకు తాళి బొట్టు కట్టి పాలు పొంగించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో అడ్డాలో దీపం వెలిగించి గ్రామంలోని హనుమాన్ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి పాడిపంటలు బాగుండాలని కోరుకుంటారు.
ఒలిగ్యో ఒలిగ్యా సాలం పాలిగ్యా
తూర్పు దిశలో పాలు పొంగితే పంటలు సమృద్ధిగా పండుతుందని భావించే రైతులు పాలు పొంగిస్తారు. ఈ సందర్భంగా మగవాళ్లు ఒలిగ్యో ఒలిగ్యా సాలం పాలిగ్యా అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జొన్న గుడిలోనే ఓ గొయ్యి తవ్వి అంబలి, అన్నంతో ఉన్న మట్టి కుండను మూసి.. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆ కుండను వెలికి తీసి దిగుబడి వచ్చిన పంటను అదే కుండలో నింపి ఇంటికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.







