త్రివేణ సంగమ తీరాన కోట్లాది మంది ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయే ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా (Maha kumbh mela). అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకలో హిందువులే కాకుండా దేశవిదేశాల నుంచి ఇతరులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహా కుంభమేళా 12 ఏళ్లకోసారి భక్తజనాన్ని పలకరిస్తోంది. సంక్రాంతి (జనవరి 13వ తేదీ) నుంచి శివరాత్రి దాకా 45 రోజులపాటు ఈ మహాకుంభమేళా జరగనుంది.
45 రోజుల పాటు మహాకుంభమేళా
ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకూ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Maha kumbh mela date 2025) జరగనుంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు భారీగా హాజరు కానున్న ఈ కుంభమేళాలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మిస్తోంది. 30 బల్లకట్టు వంతెనల నిర్మాణం చేపట్టింది. 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని నియమిస్తోంది.
భక్తుల భద్రతకు పెద్దపీట
మరోవైపు కోట్లాది మంది తరలిరానున్న ఈ కుంభమేళాలో భక్తుల భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లు ఉపయోగిస్తూ.. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. రిమోట్ కంట్రోల్‌తో పని చేసే నీటిపై తేలియాడే రక్షణ బోయకట్టెలను వినియోగించనున్నారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్‌తో పర్యవేక్షించనున్నారు.
ముఖ్యమైన కార్యక్రమాలు
-
- పవిత్ర నదీ స్నానం (షాహీ స్నాన్).
- గంగా హారతి
- కల్పవాస్
- దైవపూజ
- దీప దానం
- పంచక్రోశ్ పరిక్రమ
- సంకీర్తన, భజన
- యోగా, మెడిటేషన్
- అఖాడాల ప్రదర్శన
- 2,000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన






