శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా, కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) కథానాయికలుగా నటించి మెప్పించిన సినిమా ‘సింగిల్’ (Single) సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రానే వచ్చింది (Single Ott Release). అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ కథ
విజయ్ (శ్రీవిష్ణు), అరవింద్ (వెన్నెల కిషోర్) ఓ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే మెట్రోలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి విజయ్ మనసు పారేసుకుంటాడు. ఓ కారు షోరూంలో పని చేసే ఆమెని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా డ్యాన్సర్ హరిణి (ఇవానా) తన జీవితంలోకి వస్తుంది. ఓవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే.. మరోవైపు అతడిని ప్రేమిస్తూ హరిణి వెంటపడుతుంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమకథ అలా ఎన్ని మలుపులు తిరిగింది? ఆఖరికి విజయ్ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా? లేక ఇంకేమైనా జరిగిందా? అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.






