
నటి శ్రీదేవితో (Sridevi) తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు ఆమె భర్త , బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor). తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, తుదిశ్వాస వరకూ ఆమెను ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు. తాను శ్రీదేవికి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె అంగీకరించలేదని, కొద్దికాలం పాటు తనతో మాట్లాడలేని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రపోజ్ చేసినప్పుడు తిట్టింది
‘ఆమెను నేను జీవితాంతం లవ్ చేస్తూనే ఉంటా. నా చివరిక్షణం వరకూ ఆమె జ్ఞాపకాలతో ప్రేమలో ఉంటా. ప్రేమ, పెళ్లి విషయంలో ఆమెను ఒప్పించడానికి నాకు దాదాపు ఆరేళ్ల సమయం పట్టింది. తొలిసారి నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నన్ను తిట్టింది. దాదాపు ఆరు నెలలు నాతో మాట్లాడలేదు’ అన్నారు. ‘మీకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు మీరు నాతో ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు?’ అని శ్రీదేవి (Sridevi) ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేసుకున్నారు. తన మనసులోని భావాన్ని ఆమెకు పూర్తిగా తెలియజేశానని ఆ తర్వాత కొంతకాలానికి ఆమె అంగీకరించిందని చెప్పారు.
నా మొదటి పెళ్లి విషయాన్ని ఎక్కడా దాచలేదు
‘ఈ భూమ్మీద ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. దానికి నేనేమీ అతీతుడిని కాదు. శ్రీదేవితో ప్రేమలో పడటానికి ముందు నాకు పెళ్లి అయ్యింది. పిల్లలున్నారు. ఈ విషయాన్ని నేను ఎక్కడా దాచలేదు. నా ప్రేమ గురించి నా మొదటి భార్య, పిల్లలకు చెప్పా. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు’ అని అన్నారు. శ్రీదేవి కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో బోనీకపూర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో 1996లో వీరి పెళ్లి జరిగింది. 2018లో శ్రీదేవి చనిపోయారు. శ్రీదేవి–బోనీ కపూర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిలో జాహ్నవీ కపూర్ (Janhvi Kapoor) ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ నిరూపించుకుంటోంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవరలో నటించింది. బుచ్చిబాబు–రామ్‌చరణ్ కాంబోలో వస్తున్న సినిమాకు ఎంపికైంది. ఖుషి కపూర్ (Khushi Kapoor) సైతం ఈ మధ్యే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.