హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(High Court Judges),ఇతర న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్(Equal pension)తో పాటు పదవీ విరమణ తర్వాత రావాల్సిన ప్రయోజనాలను అందించాలని సుప్రీం కోర్టు(Supreme court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన వారికి, సాధారణ న్యాయమూర్తులతో సమానంగా పెన్షన్ లభించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
వన్ ర్యాంకు వన్ పెన్షన్ తప్పనిసరి..
జస్టిస్ బి.ఆర్.గవాయ్(Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.’ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ (One Rank One pension) సిద్ధాంతాన్ని హైకోర్టు న్యాయమూర్తులకు కూడా వర్తింపజేయాలని కోర్టు పేర్కొంది. పదవీ విరమణ ప్రయోజనాల్లో న్యాయమూర్తుల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించడమే అని ధర్మాసనం అభిప్రాయపడింది. అదనపు న్యాయమూర్తులైనా, శాశ్వత న్యాయమూర్తులైనా పదవీ విరమణ తర్వాత ఒకే విధమైన పెన్షన్ పొందేందుకు అర్హులని కోర్టు స్పష్టం చేసింది.
చనిపోయిన వారికి కుటుంబాలకు సైతం..
అలాగే, బార్ కౌన్సిల్ నుంచి నియమితులైనవారు లేదా జిల్లా న్యాయవ్యవస్థ నుంచి పదోన్నతి పొందినవారు అనే తేడా లేకుండా అందరికీ సమాన పెన్షన్ వర్తిస్తుందని తెలిపింది.ఈ తీర్పుతో రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఏటా రూ.15 లక్షలు, ఇతర రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు (అదనపు న్యాయమూర్తులతో సహా) ఏటా రూ. 13.50 లక్షలు (కొన్ని నివేదికల ప్రకారం 13.6 లక్షలు) పూర్తి పెన్షన్‌గా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని(Central government) సుప్రీం కోర్టు ఆదేశించింది.
విశ్రాంత న్యాయమూర్తుల హర్షం
చనిపోయిన న్యాయమూర్తుల కుటుంబాలకు కూడా సమాన కుటుంబ పెన్షన్ ప్రయోజనాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోనుంది. వివక్ష లేని పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని నిలబెట్టాలని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






