26/11 ముంబయి ఉగ్రదాడి (26/11 Mumbai terror attacks) కి సూత్రధారి తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎట్టకేలకు భారత్ చేతికి చిక్కాడు. ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేతికి చిక్కి లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు అన్ని రకాల న్యాయమార్గాలు ఉపయోగించినా ఫలితం లేకపోయింది. చట్టం అతడి చుట్టం కాదని నిరూపిస్తూ.. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా రాణాను అమెరికా భారత్ కు అప్పగించాలని నిర్ణయించింది.
కాసేపట్లో భారత్‌కు రాణా
ఇందులో భాగంగా కాసేపట్లో తహవ్వుర్ రాణా భారత్ కు చేరుకోనున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో (High Alert in Delhi) ఉన్నతాధికారులు హై అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు రాణాను తరలించే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నారు. అతణ్నితరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే అతణ్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ హెడ్ ఆఫీసుకు తీసుకెళ్లనున్నారు.
ఢిల్లీలో హై అలర్ట్
ఈ క్రమంలో కొన్ని సాయుధ వాహనాలు ఆ వాహనాన్ని ఫాలో కానున్నాయి. మరోవైపు ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచిన అధికారులు.. SWAT కమాండోలను ఎయిర్ పోర్టు వద్ద అలర్ట్ లో ఉంచారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ తో పాటు మార్క్స్‌మ్యాన్ వెహికిల్ రెడీగా ఉంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు చిక్కాడు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ నియమితులయ్యారు.






