Mana Enadu : ప్రముఖ కోలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ దిల్లీ గణేశ్ (Delhi Ganesh) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన చెన్నైలో 11.30 గంటలకు మరణించారు. తెలుగు, తమిళం, మలయాళ (Malayalam), హిందీ ప్రేక్షకులకు ఆయన సుపరిచతమే. దాదాపు ఆయన 400కిపైగా సినిమాల్లో నటించారు.
తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే
దిల్లీ గణేశ్.. చివరగా కమల్ హాసన్ భారతీయుడు 2 (bharateeyudu 2) సినిమాలో కనిపించారు. ఇక తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు వంటి సినిమాల్లో అలరించారు. ఆయన మృతిపట్ల కోలీవుడ్, టాలీవుడ్, హిందీ పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకు తీరనిదని అంటున్నారు.
ఇండియన్ నేవీ జాబ్ వదిలి
దిల్లీ గణేశ్ 1944, ఆగస్ట్ 1న తమిళనాడులోని తిరునెల్వెలిలో జన్మించారు. ఆయన అసలు పేరు గణేశన్. 1976లో కె.బాలచందర్ (K. Balachander) దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. 1981లో ‘ఎంగమ్మ మహారాణి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1964 నుంచి 1974 వరకు ఇండియన్ నేవీలో పని చేసిన ఆయన.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు.
తమిళనాడు స్టేట్ అవార్డు
తన కెరీర్ ప్రారంభంలో దిల్లీ గణేశ్.. దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్ గ్రూప్ సభ్యుడిగా పని చేశారు. గణేశన్(ganeshan)ను నటుడిగా పరిచయం చేసిన కె.బాలచందర్ ఆయనకు దిల్లీ గణేశ్ అనే పేరు పెట్టారు. 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు.. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాలను అందుకున్నారు దిల్లీ గణేశ్.