Mana Enadu : దక్షిణ భారతంలో పుంజుకుంటున్న బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మునుపటి కంటే ఎక్కువ సీట్లు, ఓటు బ్యాంకు సాధించిన కమలదళం 2028లో కచ్చితంగా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసి తీరాలనే పట్టుదలతో ఉంది. ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి కసరత్తు కూడా షురూ చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురాగల సత్తా ఉన్న సారథి (Telangana BJP Chief) కోసం ఇప్పుడు వేట షురూ చేసింది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని అధిష్ఠించనున్న నాయకుడిపై చర్చ జరుగుతూనే ఉంది.
రెండు పడవల ప్రయాణం
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన రెండు పడవల ప్రయాణం వల్ల దేనిపై సరిగ్గా దృష్టి సారించని పరిస్థితి నెలకొనడంతో త్వరలోనే రాష్ట్ర సారథి నియామకం పూర్తి చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ బాధ్యతలు చేపట్టగల సత్తా ఉన్న నాయకుడి కోసం వెతుకుతోంది. అయితే ఈ పదవి కోసం ఇప్పటికే పార్టీలోని సీనియర్, జూనియర్ నేతలు దిల్లీలో లాబీయింగ్ కూడా షురూ చేశారు. అయితే ఈ పదవి రేసులో ప్రస్తుతం పలువురు సీనియర్ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అధ్యక్ష రేసులో కీలక నేతలు
అలా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender), డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు (Raghunandan Rao)లతో పాటు రాంచందర్ రావు ఉన్నారు. వీరిలో బీసీ కేటగిరీ కింద ఈటల, ధర్మపురి పోటీ పడుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల ఎమ్మెల్యే ఉపఎన్నికలో ఓడినా.. మల్కాజిగిరి ఎంపీ (Malkajgiri MP)గా గెలిచారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ పదవికి సరిగ్గా సరిపోతారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ రేసులో డీకే అరుణ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే రాష్ట్ర పగ్గాలు ఓ మహిళా నేతకు అప్పగించడం సరైన నిర్ణయమేనా అని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతికే సారథి వస్తాడు
ఇక తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఈ పదవి రేసులో ఉన్నారు. బీసీ కేటగిరీలో ఈయనకు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని టాక్. మరోవైపు ఇందిరా గాంధీ పోటీ చేసిన ప్రాంతం, కేసీఆర్ ఇలాకా అయిన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు పేరు కూడా ఈ లిస్టులో ఉంది. విమర్శలకు దీటుగా బదులివ్వడం, స్ట్రాటజీలల్లో రఘునందన్ రావు దిట్ట. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ నాయకత్వం మరింత బలపడుతుందని హైకమాండ్ భావిస్తోంది. ఇక ఈ రేసులో సీనియర్ నేత రాంచందర్ రావు పేరు కూడా వినిపిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరనేది సంక్రాంతికి తెలుస్తుందని సమాచారం.







