Mana Enadu : తెలంగాణలో ఈ ఏడాదిలో రాష్ట్ర మంత్రివర్గ చివరి సమావేశం (Telangana Cabinet) జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
30న మంత్రివర్గ సమావేశం
మరోవైపు.. రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద పంటల పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.
రైతు భరోసాపై కీలక నిర్ణయం
ఇందులో భాగంగా మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి అర్హులను గుర్తించడానికి సంబంధించిన విధివిధానాల ఖరారుపై చర్చించనున్నట్లు తెలిసింది. అర్హులను గుర్తించి మిగతా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా(Rythu Bharosa) నగదు కర్షకుల ఖాతాల్లో జమ చేసి పండుగ కానుక ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వడివడిగా అడుగులు ముందుకేస్తోంది.
కొత్త రేషన్ కార్డులపై చర్చ
మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా కార్డు పొందేందుకు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ క్రమంలోనే జనవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. మంత్రివర్గ భేటీలో ఈ విషయంపైన కూడా చర్చించే అవకాశం ఉంది.






