గ్రూప్స్ రాసిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు అందించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని అధికారులకు ఆదేశాలిచ్చానని తెలిపారు. పరీక్షలు నిర్వహించిన నెలల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ వల్ల పదేళ్లు నష్టపోయారు
హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘ప్రజా పాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో పాల్గొని ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖ (Municipal Department)ల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కారుణ్య నియామకాలు ప్రజల హక్కు అని, కేసీఆర్ సర్కార్ (KCR Govt) కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల పదేళ్లు నష్టపోయారని రేవంత్ అన్నారు.
జాబ్ క్యాలెండర్‌తో పాటుగా కారుణ్య నియామకాలు
జాబ్ క్యాలెండర్ (Job Calendar)తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘సీఎం పదవి చేపట్టడం కన్నా జడ్పీటీసీగా గెలిచినప్పుడే నాకు ఎక్కువ ఆనందం కలిగింది. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.






