Mana Enadu : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత (Pass Percentage) పెంచడంపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి అందరు విద్యార్థులు పాస్ అయ్యేలా పక్కా ప్రణాళిక రచించింది. ఇంటర్ పరీక్షలకు ఇంకా మూడు నెలలు (90 రోజులు) సమయం ఉండటంతో ఆ దిశగా ఓ షెడ్యూల్ రూపొందించింది. కళాశాలల వారీగా 90 డేస్ ప్లాన్ (90 Days Plan) రెడీ చేసింది. ఈ ప్రణాళికను పక్కాగా విద్యార్థులతో అమలు పరిచి ఉత్తమ ఉత్తీర్ణత ఫలితాలు సాధించనున్నారు.
90 డేస్ ప్లాన్
ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి విద్యార్థి ఎలా చదుతున్నాడో తెలుసుకొని వెనకబడిన వారి కోసం ప్రత్యేక క్లాసులు (Special Classes) నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కళాశాలలకు రాని విద్యార్థుల తల్లిదండ్రలను కలిసి మాట్లాడనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య (Inter Board Secretary) తాజాగా అధికారులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే
- ప్రతి కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించాలి.
- రానున్న 90 రోజుల ప్రణాళికను తల్లిదండ్రులకు వివరించి వారి సాయం కోరాలి.
- డిసెంబరు నెలాఖరు వరకు సిలబస్ (Intermediate Syllabus) కంప్లీట్ అవ్వాలి.
- ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఒక మహిళా, ఒక పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించి మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
- టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబరుపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారు ఒత్తిడికి గురి కాకుండా చూడాలి.
- ప్రతి ప్రభుత్వ కళాశాలకు ప్రయోగశాలల కోసం వారం రోజుల్లో రూ.25 వేల చొప్పున మంజూరు చేయాలి.






