Mana Enadu : : భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) (92) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయణ్ను గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించగా.. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 9.51 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.
తెలంగాణలో సెలవు
మరోవైపు మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్య సంస్థలకు శుక్రవారం సెలవు (Holiday) ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కేంద్ర సర్కార్ కూడా వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
నేడు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ
మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనుంది. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు (Manmohan Singh Final Rites) జరగనున్నాయి. మరోవైపు ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.






