హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు (Formula E Race Case) కేసులో గంటగంటకో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Case)కు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీలను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తాజాగా హైకోర్టు (Telangana HC) కొట్టేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
అయితే ఆయన ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతకంటే ముందే తెలంగాణ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టును రేవంత్ ప్రభుత్వం (Telangana Govt) ఆశ్రయించింది. ముందస్తుగా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. “ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి” అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేటీఆర్ మరో బిగ్ షాక్ తగిలినట్లయింది.







